Tuesday, October 21, 2008

నా తరమా "ఈ" టీవీ చూడ

నా మూడో తరగతి లో అనుకుంటా. నేను స్కూల్ కి పోనని మొరాయిస్తే మా అమ్మ నన్ను "స్కూల్ మానేస్తే మానేసావు వెధవ స్కూల్ , చదివి ఎవడిని ఉద్ధరించాలి, టీవీ చూద్దాం రా నాన్న" అని ఎంతో ఆప్యాయమ్గా పిలిచింది. నేను నిజమే కామోసు అని చంకలు గుద్దు కుంటూ నా పుస్తకాల మూటని వీధి చివరలో ఉన్న పల్లీల బడ్డీ వాడికి ఇచ్చేసి వస్తా అన్నా. ఇద్దూ లేమ్మా ముందు ఈ ప్రోగ్రాం చూసి పో నాయన అంది. సరే కదా అని మా అమ్మ పళ్ళెం లో పెట్టిన జన్తికీలు నములుతూ టీవీ ముందు చతికిల పడ్డాను.దానిని ఈ టీవీ అంటారని ఆ చానెల్ ని ఇన్నాళ్ళూ మా కంట పడకుండా అమ్మ దాస్తూ వచ్చిందని తెలిసి కొద్ది గా హాచర్యం, ఆ తర్వాత మరెంతో కోపం వచ్చేసాయి. నా కోపం గుప్పెడు జన్తికీలు తో పాటు నాలో నేనే కుక్కుకొని (ఏంత లేదన్నా ఇక స్కూల్ కి పోవక్కర్లేదన్న అన్నది అమ్మే కదా అని అమ్మ కి క్షమా భిక్ష పెట్టేసా) ఈ టీవీ చూడటం మొదలెట్టా. ఆ సీరియల్ పేరు "నీ పిండాకూడు తిన తరమా" అని. రెండు నిమిషాలు అవగానే కొద్దిగా అసహనం మొదలైంది. కార్టూన్ చాన్నేల్ గాని, చిన్న బట్టలు వేసుకునే పెద్ద అమ్మాయిలను చూపెట్టే చానెల్ గాని పెట్ట మన్నాను. అమ్మ, మరి కాసేపు చూడు నాయన అంది. సరే అన్ని మళ్ళీ టీవీ మీదకి దృష్టి మల్లిన్చా. సీరియల్ లో ఒక భర్త, ఇద్దరు భార్యలు. భర్త కి తనకి రెండో భార్య ఉన్నట్టు తెలీదు. మొదటి భార్యకి తనకి పెళ్లైనట్టు తెలీదు. డైరెక్టర్ కి వాళ్ల చేత యాక్ట్ చేయించటం తెలీదు. ఇవనీ కూడా మూడో క్లాస్ చదవటం మానేద్దమన్న మతి మాలిన వెధవను నాకే అర్ధం అయ్యింది. ఇక నేను సహించ లేక పోయా. అమ్మ పోనీ క్రికెట్ అయినా పెట్టవే అన్నా. కాళ్ళు విరగ కొడతా వెధవాయి కదిలేతే అంది. నేను ఈ మాటు వస్తున్న దుఖాన్ని, జన్తికీలు అయి పోవటం మూలను, మరికొంత దుఖంతో మింగేసాను. ఈ లోపల మొదటి భార్య కి రెండో మొగుడు వచ్చాడు. ఈ రెండో మొగుడు రెండో భార్య కి అన్నయ్య అని చెప్ప బడింది. ఇదేమి దరిద్రం అని నేను అనుకుంటూ ఉండగా, డైరెక్టర్ కుక్క పిల్ల ఈ డిస్క్రిపన్సి కని పెట్టేసి సెట్ మీద కొచ్చేసి మొదటి మొగుడు, రెండో మొగుడు అన్నా తమ్ముల కాని రెండో భార్య రెండో మొగుడు ని అన్న లా చూసుకుంటుంది అని సర్దేసింది. ఇహ నా దుఖం కట్టలు తెంచు కొంది. అప్పుడు మా అమ్మ చేసిన మోసం నాకు అర్ధం అయ్యింది. అప్పటికి అప్పుడు నా పుస్తకాల బస్తా తీసుకొని, సిరికింజెప్పక రీతి లో ఒక్క అంగలో వీధి లో ఇంకో రెండు అంగాలలో నా స్కూల్ లో ఉన్నా. ఇంతకీ ఈ రోజే మళ్ళీ ఈ టీవీ చూశా. "నీ పిండా కూడు తిన తరమా" వస్తోంది(re runs కావన్దోయ్). నా తరమా అని టీవీ కట్టేసా అని చెప్పాల్సిన అవసరం వేరే గా లేదు. ఇంతకీ విషయం, నాకిప్పుడు నలభయ్ నిండాయి. (ఈ టీవీ పెట్టి ముప్పయ్ ఏడు వసంతాలు కాలేదు. exaggeration అని గమనించాలి)

2 comments:

krishna rao jallipalli said...

ఒక్క సీరియల్ .. అది ఒక్క పార్టు చూసి అంత ఇదైతే ఎలా??

కొత్త పాళీ said...

fantastic